పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్

  • దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశం
  • 45 రోజులకు పైగా జైల్లో ఉన్న బండి భగీరథ్
  • త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్న పోలీసులు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో అతడికి గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా భగీరథ్‌ను హైకోర్టు ఆదేశించింది.

ఒక మైనర్‌ బాలికకు సంబంధించిన ఉదంతంలో మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో మే 16న పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. దాదాపు 45 రోజులుగా అతడు జైలులోనే ఉంటున్నాడు.

బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భగీరథ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, నిందితుడు విద్యార్థి అని, జైలులో ఉండటం వల్ల చదువు నష్టపోతున్నాడని కోర్టుకు విన్నవించారు. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్‌ను వ్యతిరేకించారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, నిందితుడిని విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె. సుజన భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేశారు. కాగా, తన బీబీఏ పరీక్షలకు హాజరయ్యేందుకు భగీరథ్‌కు గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Bandi Bhagirath
POCSO case
Telangana High Court
Bandi Sanjay son
Conditional bail

More Telugu News